Wednesday 30 January 2019

పాల దిగుబడి పెరగాలంటే...

పశు పోషణ విషయంలో చాలా మంది రైతులు నేటికీ సంప్రదాయ పద్ధతులనే పాటిస్తున్నారు. పాడి పశువులకు పోషక విలువలతో కూడిన దాణాను అందించలేకపోతున్నారు. ఫలితంగా దేశవాళీ గేదెలు గరిష్ట స్థాయిలో పాల ఉత్పాదక సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోతున్నాయి. పాడి పశువుల నుంచి అధిక పాల దిగుబడిని పొందాలంటే పుష్టికరమైన మేపును అందించాల్సిందే. అంటే వరిగడ్డితో పాటు సమీకృత దాణానూ ఇవ్వాలి.

దాణా ఎలా ఉండాలి?

పాల ఉత్పత్తి సమయంలో, చూడి దశలో, పెరుగుదల దశలో పశువులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలి. అంటే పశువు రోజువారీ ఆహార అవసరాలకు అనుగుణంగా ఎక్కువ మాంసకృత్తులను, అధిక శక్తిని అందించే ఆహారాన్ని ఇవ్వాలి. ఇందుకోసం అధిక పోషక విలువలు కలిగిన దినుసులను తగు పాళ్లలో కలిపి మర పట్టించాలి. ఆ మిశ్రమాన్నే దాణా అంటారు. ఇందులో జీర్ణమయ్యే మాంసకృత్తులు, పూర్తిగా జీర్ణమయ్యే పోషక పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. దాణాలో మాంసకృత్తులు 16 శాతం, జీర్ణమయ్యే పోషక పదార్థాలు 70 శాతం ఉండేలా వివిధ దినుసులు, పదార్థాలను కలుపుకోవాలి.

ఎంత ఇవ్వాలి?

సాధారణంగా చాలా మంది రైతులు పశువులకు దాణాగా తౌడును వేస్తుంటారు. సమీకృత దాణా తయారీకి ఖర్చు కొంచెం ఎక్కువ కావడమే దీనికి కారణం. అయితే మాంసకృత్తులు, పోషకాలు, ఖనిజ లవణాలు తగు పాళ్లలో ఉండే సమీకృత దాణాను అందిస్తే పశువులో పాల దిగుబడి సామర్థ్యం పెరుగుతుంది. రెండు లీటర్లకు పైబడి పాలిచ్చే పశువులకు తప్పనిసరిగా సమీకృత దాణాను ఇవ్వాలి. పాలిచ్చే గేదెలైతే ప్రతి రెండు లీటర్లకు కిలో చొప్పున రోజుకు ఏడు కిలోలకు మించకుండా దాణాను అందించాలి. పాలిచ్చే ఆవులకు ప్రతి 2.5 లీటర్లకు ఒక కిలో చొప్పున దాణా ఇవ్వాలి.

తాజాగా ఉండాలి

పశువులకు అందించే దాణా తాజాగా ఉండాలి. అంటే దానిని ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి కలుపుకోవాలి. గాలి చొరబడని డబ్బాలు లేదా సంచులలో దాణాను నిల్వ చేసుకోవాలి. దాణా తయారీలో వినియోగించే గింజలను చెక్క ముక్కగా ఆడించాలి. వాటిని ముందుగానే ఆడించి నిల్వ చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే గింజలపై ఉన్న పొరలు ఊడిపోయి చీడపీడలు సులభంగా ఆశిస్తాయి.

జాగ్రత్తలు తీసుకోవాలి

దాణాను తయారు చేసేటప్పుడు పదార్థాలన్నీ బాగా కలిసిపోయేలా చూసుకోవాలి. ముఖ్యం గా తక్కువ పరిమాణంలో వాడే ఖనిజ లవణ మిశ్రమాన్ని దాణాలో కలిపేటప్పుడు తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఒకవేళ కుదరకపోతే దానిని దాణాలో కలపకుండా పశువుకు అందించే ఆహారాన్ని బట్టి రోజువారీగా విడిగా ఇవ్వడం మంచిది. దాణా తయారీకి ఉపయోగించే పదార్థాలు బాగా ఎండి, పెళుసుగా ఉండాలి. వాటిలో తేమ 5 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. తేమ ఎక్కువైతే మొక్కజొన్న, వేరుశనగ, సోయా పిండ్లు బూజు పడతాయి. అప్పుడు దాణాలో అప్లోటాక్సిన్ అనే విష పదార్థం చేరుతుంది. బూజు పట్టిన మొక్కజొన్న గింజలు నల్లగా మారతాయి. అలాంటి వాటిని దాణా తయారీకి ఉపయోగించకూడదు. నాణ్యమైన గింజలనే వాడాలి. వేరుశనగ, సోయా గింజలపై శిలీంద్రాలు (ఫంగస్) ఉన్నాయేమో చూసుకోవాలి. ఆ గింజలను చిన్న చిన్న ముక్కలుగా విరి చి, అంచులను పరిశీలిస్తే నాణ్యంగా ఉన్నాయా లేదా అన్న విషయం అర్థమవుతుంది.

పత్తి పిండిని మరీ ఎక్కువగా... అంటే 10 శాతానికి మించి వాడకూడదు. ఎందుకంటే దానిలో గోస్పీపోల్ అనే విష లక్షణం ఉంటుంది. ఉప్పు కలపని ఖనిజ లవణ మిశ్రమాన్ని కొనడం మంచిది. ఆ తర్వాత దానికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి. అయొడైజ్డ్ ఉప్పును వాడడం వల్ల పశువులకు పునరుత్పత్తికి దోహదపడే అయొడిన్ అందుతుంది.

ఇలా చేయండి

100 కిలోల సమీకృత దాణాను తయారు చేసుకోవాలంటే 25-30 కిలోల బియ్యం/గోధుమ తౌడు, 30-40 కిలోల మొక్కజొన్న/జొన్న గింజల పిండి, 20-30 కిలోల వేరుశనగ/తెలగ/పత్తి/కొబ్బరి తెలగ పిండి, కిలో ఉప్పు, రెండు కిలోల ఖనిజ లవణ మిశ్రమంతో పాటు 20 కిలోల వరకూ ఉలవలు/శనగపొట్టు/కందిపొట్టు/కర్రపెండలం పిప్పి అవసరమవుతాయి. లభ్యత, ధరను దృష్టిలో ఉంచుకొని అనువైన ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవాలి. ధాన్యపు గింజలు పశువుకు శక్తినిస్తాయి. ఎందుకంటే వీటిలో పోషకాలు, మాంసకృత్తులు ఉంటాయి. తౌడు ద్వారా పశువులకు జీర్ణమయ్యే పోషకాలు, మాంసకృత్తులతో పాటు విటమిన్లు, భాస్వరం, పీచు పదార్థాలు కూడా లభిస్తాయి. పిండి ద్వారా మాంసకృత్తులు, అదనపు శక్తి చేకూరుతాయి. దాణాలో తగినంత మొలాసిస్ కలిపితే మంచి రుచి వస్తుంది. పశువులకు శక్తి కూడా లభిస్తుంది. ఖనిజ లవణాలు పశువుల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వంద కిలోల దాణా కోసం 30 కిలోల తౌడు (నూనె తీసిన), 37 కిలోల గింజలు, 22 కిలోల తెలగ పిండి, 8 కిలోల పత్తి పిండి, 2 కిలోల ఖనిజ లవణాలు, కిలో ఉప్పు కలుపుకున్నా సరిపోతుంది.

Sunday 20 January 2019

గోశాల అనగానె ఆవుల పోషణ, సంరక్షణ మాత్రమే అనుకుంటాం. ఆవుల పెంపకం ద్వారా పాలు, పాల ఉత్పత్తులు పొందడమే అనుకుంటాం. కానీ గోశాలల నుంచి సేంద్రియ ఎరువులను తయారు చేయవచ్చని, తద్వారా రసాయన అవశేషాలులేని పంటలను అందించవచ్చనీ ఈ గో(ప్రయోగ)శాలల ద్వారా అనుకుంటున్నాము
మంచిర్యాల మండలం శివలింగాపూర్ గ్రామంలో రెండెకరాల్లో చెన్నూరుకు చెందిన శ్రీ పోటు సత్యనారాయణ రెడ్డి(సి ఆర్ ఐ పొంపులు) వారిచే 2015లో గోశాలను ప్రారంభించారు. పాడి సంపద అంతరించిపోతున్న నేపథ్యంలో దేశవాళీ ఆవులను పోషించటంతో పాటు సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో గోశాలను ప్రారంభించారు. పది  ఆవులతో ప్రారంభమైన గోశాలలో ఇప్పుడు అరవై ఆవుల వరకు ఉన్నాయి. రైతులు సేంద్రియ సాగు చేసేలా మూత్రము పేడను తోటి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. రెండెకరాల స్థలంలో ప్రారంభమైన గోశాల ప్రస్తుతం 25ఎకరాలకు విస్తరించింది. ఇందులో 15ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో మామిడి,కొబ్బరి, జమ, సపోటా, జొన్న, వరి ,నువ్వులు  పంటలను సాగు చేస్తున్నారు.


గోశాలలో ప్రతి సంవత్సరం రైతులకు ప్రకృతి సేద్యం, సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన కల్పించాలని, రసాయన ఎరువులు వాడటంతో భూసారం తగ్గి దిగుబడులు రాకపోవడం తో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి జీరో బడ్జెట్‌తో ప్రకృతి వ్యవసాయంలో వర్మీకంపోస్టు, ఆవు మూత్రం, ఆవు పేడ, జీవామృతం, ఘన జీవామృతం వంటి సేంద్రీయ ఎరువులను వాడాలని, దీని వల్ల భూసారం పెరిగి అధిక దిగుబడులు సాధించే పద్దతులపై అవగాహన కల్పిస్తూ రైతులతో సేంద్రీయ వ్యవసాయం చేయిచాలి అనుకుంటున్నాము